Latest News Uncategorized లైఫ్ స్టైల్

Yoga Mudras: యోగ ముద్రలు – ఆరోగ్య జీవనానికి మార్గాలు

యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది..అయితే యోగ సాధనకు కాల నియమం ఉంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను వేస్తారు. అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు.

మనం చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, మనకు తెలియదు. చేతి వేళ్లు, అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికీ కేంద్ర స్థానాలు ఉంటాయి. ఇందులో మన శరీరానికి అరచేయి ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన చేతి వేళ్ల ద్వారా మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు. చేతి వేళ్ళని కొన్ని భంగిమలలో పెట్టె ప్రక్రియని ముద్ర అంటారు.

మన చేతులకు ఉండే ఐదు వ్రేళ్ళు ఐదు రకాల మూల పదార్థాలను సూచిస్తాయి… అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వీటినే పంచభూతాలు అంటారు. మానవశరీరం కూడా ఈ పంచ భూతాలతోనే తయారైనది. అందుకే శబ్ద, స్పర్శ, రూప, రస, గంథములనే ఐదు తత్త్వాలు మన శరీరంలో ఉన్నాయి. మన చేతిలోని ఒక్కొక్క వ్రేలు ఒక్కొక్క మూలకాన్ని సూచిస్తుంది.

Also Read: నానబెట్టిన బాదమే ఎందుకు తినాలి? కారణమిదే!

మన చేతి వేళ్లు అయిదూ పంచభూతాల్లో ఒక్కో తత్త్వానికి సంకేతం:

★ పృథ్వీతత్త్వం – ఉంగరపు వేలు
★ జలతత్త్వం – చిటికెనవేలు
★ అగ్నితత్త్వం – బొటనవేలు
★ వాయుతత్త్వం – చూపుడువేలు
★ ఆకాశ తత్త్వం – మధ్యవేలు

జ్ఞాన ముద్ర:

మరి ఈ జ్ఞాన ముద్ర వేయడం ఎలా అంటారా చాల సులభం. మనం బొటన వేలుని చూపుడు వేలుతో కలిపి ఉంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా నిలపడమే ఈ జ్ఞాన ముద్ర. ఇది మనం ఎపుడైనా వేయవచ్చు నిల్చున్నపుడు, కూర్చున్నపుడు, నిద్రపోయేటప్పుడు ఇలా ఎప్పుడైనా వేయవచ్చు.

ఈ జ్ఞాన ముద్ర మనోశక్తిని, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. దీని వలన అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇలా చేస్తే మైగ్రేన్‌ తలనొప్పికి కూడా ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది.

వాయు ముద్ర:

మన చేతిలో చూపుడు వేలుని మధ్యకి మడిచి బొటనవేలితో అదిమిపెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే వాయు ముద్ర. ఈ ముద్రని వేయడం వల్ల శరీరంలోని వృధా వాయువులను బయటకు పంపుతుంది. గ్యాస్‌, ఛాతినొప్పిని నివారిస్తుంది. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది.

ప్రాణ ముద్ర:

ఈ ముద్ర ఎలా వేయాలంటే మన ఉంగరపు వేలుని ,చిటికెన వేలుని బొటనవేలికి టచ్ చేసి మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ ప్రాణ ముద్ర ,ఇది ఎప్పుడు ఐన వేయవచ్చు. ఇది వేయడం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది , ఇంకా బద్దకాన్ని నివారిస్తుంది, ఇంకా మానసికంగా , శారీరకంగా దృఢంగ ఉండేలా చేస్తుంది ,ఇంకా మన కంటిచూపు మందగించడాన్ని మెరుగుపరుస్తుంది ,ఈ ముద్ర వేయడం వల్ల మనిషి చాల ఆక్టివ్‌గా ఉంచేలా చేస్తుంది.

శూన్య ముద్ర:

ఈ శూన్య ముద్రని ఎలా వేయాలంటే మన మధ్య వేలుని బొటన వేలుతో ఒత్తి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టాలి. మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రతో చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్టుండి తలతిరగడాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్‌ సమస్యలను నయం చేస్తుంది. ఇది క్రమశిక్షణ మరియు ఓర్పును పెంచుతుంది.

మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. చెముడు మరియు చెవికి సంబంధించిన రుగ్మతను తగ్గిస్తుంది. ఇలా రోజుకి కనీసం నలభై నిమిషాలైనా చేస్తే మన శరీరంలో ఉన్న డల్‌నెస్ అనేది లేకుండా పోతుంది. ఇది బద్దకాన్ని నివారిస్తుంది. రెండు మూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు రెగ్యులర్‌గా చేయాలి.

ఆపాన ముద్ర:

మధ్యవేలు, ఉంగరం వేలు రెండు బొటనవేలు అంచుని తాకేలా చేయాలి. చిటికెన వేలు చూపుడు వేలు లాగిపెట్టాలి. కలిసిన మూడు వేళ్ళ మధ్య వత్తిడి కలిగించాలి. ప్రోస్టేట్‌, మోనోపోజ్‌ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది. శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు విసర్జించేందుకు సహాయపడుతుంది. మూత్ర సమస్యలు తొలగిపోతాయి. మధుమేహాన్ని కూడా నివారిస్తుంది.

అగ్ని/సూర్య ముద్ర:

సూర్యుడి శక్తి శరీరం యొక్క అగ్ని మూలకంతో కూడా సూచిస్తుంది..కాబట్టి సూర్య ముద్రను అగ్ని ముద్ర అని కూడా పిలుస్తాం. ఈ ఎలా వేయాలంటే మీఉంగరం వేలును మడిచి దాని మీద బొటనవేలు ఉంచాలి. సైడ్ నుంచి ఒక వేలు లాగా కనపడాలి.ముందు నుంచి చేస్తే చిటెకెన వేలు విడిగా ఉంటుంది. మిగిలిన వేళ్ళు కలిసి ఉంటాయి.అరచేతులు ఆకాశం వైపు ఉంటాయి. అరచేతులు వెనుక భాగం మోకాళ్ళపై ఉంటుంది. నడుము, తల తిన్నగా ఉంటుంది. ఉంగరం వేలు భూతత్త్వం కాబట్టి దాన్ని తగ్గిస్తే శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపిస్తుంది.

సూర్య ముద్ర ప్రాథమికంగా సూర్యుడు యొక్క శక్తిని గుర్తుకు తెస్తోంది.మీరు సూర్యుని శక్తిని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు దీనిని ఉదయాన్నే చేయాలి. మీరు బరువు తగ్గాలనుకుటె ఈ ముద్ర వేస్తూ ఆహర నియమాలు పాటించాలి. పండ్లు బాగా తినాలి.ఆహరం మితంగా తీసుకోవాలి. అది కూడా ఖాళీ కడుపుతోనే.. ప్రతిరోజూ 30 నిమిషాలు ఇలా చేయండి. అగ్ని ముద్ర అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది, తద్వారా ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ యొక్క విధానాన్ని వేగవంతం చేస్తుంది.

వరుణ ముద్ర:

బొటన వేలు, చిటికెన వేలు కలిపితే వరుణ ముద్ర. మిగిలిన మూడు వేళ్ళను ఒకదానికి ఒకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి. ఈ ముద్ర వలన కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది. ప్రోస్టెడ్‌ సమస్యలు తగ్గిపోతాయి. రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు కూడా తగ్గుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అందాన్ని పెంచుతుంది. కండరాలు ముడతలు పడకుండా కాపాడుతుంది. మీ చర్మంను తేమగా ఉంచుతుంది.

లింగ ముద్ర:

అన్ని వేళ్లనూ ఒకదానితో ఒకటి పెనవేసి కుడిచేతి బొటనవేలిని మాత్రం పైకి ఉంచాలి. ఈ ముద్ర జలుబు, రొంప తదితర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ ముద్ర మీ కామేచ్ఛను పెంచుతుంది. చలి సంబంధిత ఆరోగ్య సమస్యలను వదిలించుకోవటానికి సహాయపడుతుంది.

ఆపాన వాయు ముద్ర:

వాయు ముద్రలాంటిదే ఇది కూడా. చిటికెన వేలు తప్ప మిగిలిన నాలుగు వేళ్లను చివరి అంచులతో బంధించాలి. ఈ ముద్ర హృదయ సంబంధిత తీవ్రతను తగ్గిస్తుంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

పృథ్వీ ముద్ర:


ఉంగరం వేలు బొటనవేలు అంచులు కలిపి ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడు వేళ్ళు ఆకాశం వైపు చూస్తుండాలి. ఈ ముద్ర మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. శరీర బలహీనతను పోగొడుతుంది. చర్మకాంతిని పెంచుతుంది. ఓర్పును పెంచుతుంది. ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అల్సర్లను తగ్గిస్తుంది. విటమిన్లు పెరుగుతాయి.

శక్తి ముద్ర:


చివరి రెండు వేళ్ళను బొటను వేలితో కలపాలి. మిగిలిన రెండు వేళ్ళను ఒకదానితో ఒకటి తాకుతుండాలి. శక్తి ముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది. దృష్టి లోపాన్ని సరిచేస్తూనే కంటి చూపుని మెరుగుపరుస్తుంది.

బ్రహ్మ ముద్ర:


రెండు చేతుల బొటన వేళ్లనూ మడిచి, మిగతా నాలుగు వేళ్లనూ దాని మీదుగా మడవాలి. ఆ తర్వాత రెండు చేతులనూ దగ్గరికి నాభి ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే రక్తపోటు సమస్యల్ని నియంత్రిస్తుంది.

ఆది ముద్ర:

బొటన వేలును మడిచి, మిగతా నాలుగు వేళ్లనూ బొటనవేలు మీద ఉంచాలి. దీనివల్ల జ్ఞానేంద్రియాలకు ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. మనసుకు ఉత్సాహాన్నిస్తుంది. రక్తపోటు తక్కువ ఉన్నవారు ఈ ముద్ర జోలికి వెళ్లకపోవడం మంచిది.

ధ్యాన ముద్ర:


ఈ ధ్యాన ముద్ర ఎలా చేయాలంటే మన రెండు చేతుల్ని అరచేతులు పైకి వచ్చేలా మన ఒడిలో పెట్టుకుని రెండు బొటన వేళ్ళు మాత్రమే టచ్ అయేలా ఉంచాలి. దీన్ని కదలకుండా నిటారుగా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచి ఎంతసేపైనా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చిరాకు,డిప్రెషన్, స్ట్రెస్ లాంటి వాటినుండి చాల రిలీఫ్ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర.

అంజలి ముద్ర:

అంజలి ముద్ర అంటే నమస్కార ముద్ర. ఈ ముద్ర మన ఆత్మను పరమాత్మతో ఏకం చేయడాన్ని సూచిస్తుంది. ఇంకా, ఈ ముద్ర మనలోని ప్రతికూల మరియు సానుకూల శక్తులను తటస్థీకరిస్తుంది. అంజలి ముద్ర అనేది ఇతర వ్యక్తులకు గౌరవం చూపించడానికి ఉపయోగిస్తారు, కానీ యోగాలో, ఇది ముద్రల శ్రేణిలో భాగం. రెండు చేతుల అరచేతిని కలిపి, ఒకదానికొకటి వేలును తాకండి. చేతుల్లో ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా చూసుకోండి.మీ ఛాతీకి దగ్గరగా బ్రొటనవేళ్లు చేరాలి. మీకు కావలసినంత కాలం మీరు దీన్ని చేయవచ్చు. ఈ ముద్ర వల్ల మన శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ ముద్ర కూడా ఒక ధ్యాన ముద్ర, దీనికి ఏకాగ్రత మరియు దృష్టి అవసరం.

★ దృష్టి మెరుగుపరుస్తుంది:
అంజలి ముద్ర కూడా ఏకాగ్రత సాధన కాబట్టి, ఇది మనస్సు యొక్క స్థిరత్వాన్ని పెంచుతుంది. స్థిరమైన మనస్సు మరియి ఒక నిర్దిష్ట విషయంపై బాగా దృష్టి పెట్టే శక్తిని ఇస్తుంది. ఈ ముద్ర మన ఆలోచనలను శాంతపరుస్తుంది మరియు మెదడును క్లియర్ చేస్తుంది. ఇది మనస్సును బలపరుస్తుంది మరియు స్థిరంగా చేస్తుంది.

★ మెదడు యొక్క ఎడమ మరియు కుడి అర్ధగోళాన్ని కలుపుతుంది:
కుడి చేతి అరచేతి ఎడమ మెదడుతో మరియు ఎడమ చేతి అరచేతి కుడి మెదడుతో అనుసంధానించబడి ఉంటుంది. అందువల్ల రెండు చేతుల ఒక దగ్గర చేర్చడం ద్వారా మెదడు యొక్క ఎడమ మరియు కుడి అర్ధగోళాన్ని కలుపుతుంది. ఈ ముద్ర మనస్సును చైతన్య పరుస్తుంది.

అందుకే మీ చేతి వేళ్ళలో ఏ రెండు వేళ్లను కలిపినా మీ శరీరంలో ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తే ఆరోగ్యంగా ఉంటామనుకోకండి. పోషక ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ, ఈ ముద్రలు వేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *