Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

జూన్‌ 8 నుంచి పదోతగతి పరీక్షలు.. కసరత్తు మొదలుపెట్టిన అధికారులు

పదోతరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో జూన్‌ 8వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ప్రభుత్వ ఆమోదంతో పరీక్షల ప్రణాళికను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌తో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు మే 19న సమావేశమై ఈ విషయమై చర్చించారు.

ఇప్పటికే ఆలస్యమైనందున జూన్‌ 8వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు ఖరారు చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించినట్లు సమాచారం. జూన్‌ 3న కరోనా పరిస్థితిపై సమీక్షించుకోవాలని, 4వ తేదీన విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఒకవేళ అప్పటికి తగ్గకుంటే ప్రత్యామ్నాయం ఏమిటనే చర్చా వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని వారు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

8 పరీక్షలు..25 రోజులు
ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల వ్యవధి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం జూన్‌ 8వ తేదీ పరీక్షలు మొదలైతే సెలవులతో కలిపి ఎనిమిది ప్రధాన పరీక్షలు పూర్తి కావడానికి 25 రోజులు పడుతుందని అంచనా. అంటే జులై 2వ తేదీకి పూర్తవుతాయి. ఒకేషనల్‌ పరీక్షలు జులై 6, 9, 13 తేదీల్లో జరుగుతాయి.

షరతులతో హైకోర్టు అనుమతి
రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షలను షరతులతో నిర్వహించుకునేందుకు హైకోర్టు మే 19న ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది.

జూన్‌ 3న కరోనా వ్యాప్తిపై సమీక్షించాలని, తీవ్రత ఎక్కువగా ఉంటే పరీక్షలను వాయిదా వేసుకోవచ్చని, లేదంటే జూన్‌ 8వ తేదీ నుంచి పరీక్షల నిర్వహణపై ముందుకెళ్లవచ్చని పేర్కొంది.

పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరును పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జూన్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు షరతులివే..

☛ పరీక్ష కేంద్రం, నిర్వహణ నిర్ణయాలపై అన్ని మాధ్యమాల్లో విస్తృతంగాప్రచారం చేయాలి.

☛ పరీక్షకు.. పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉండాలి.

☛ పరీక్షకు ముందు తరువాత శానిటైజేషన్‌ చేసి కేంద్రాలను శుభ్రం చేయాలి.

☛ అవసరమైనన్ని థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లు, తగినంత మంది వైద్య సిబ్బందిని
అందుబాటులో ఉంచాలి.

☛ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలి.

☛ ఇరుకైన గదుల్లో కాకుండా, పెద్ద ఆవరణలున్న కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలి.

☛ కంటెయిన్‌మెంట్‌, రెడ్‌జోన్‌లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా పరీక్ష కేంద్రాలకు తరలించే ఏర్పాట్లుండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *