Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Salary Hike: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో.. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, జీతాల్లో కోతలు విధించడం చేస్తున్నాయి. అయితే బ్యాంకు ఉద్యోగులకు మాత్రం శుభవార్త అందింది.

పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనపెంపుతో పాటు పెన్షన్‌ కంట్రిబ్యూషన్‌ను నాలుగు శాతం పెంచేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ నిర్ణయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే 8.5 లక్షల మందికి, 50వేల మంది పాత ప్రైవేటు రంగ బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

నవంబర్ 2017 నుండి జీతాల పెంపు వర్తిస్తుంది. వార్షిక వేతనాన్ని 15 శాతం పెంచడంతో బ్యాంకులపై రూ.7,900 కోట్లు అదనంగా భారం పడనుంది. కాగా, గతంలో ఈ ఉద్యోగుల బేసిక్‌ వేతనంలో 10 శాతం, డీఏ రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల్లో కలుస్తుండగా, తాజా వేతన సవరణతో 14 శాతం బేసిక్‌, డీఏలు పెన్షన్‌ మొత్తానికి జమవుతాయి.

పీఎస్‌యూ బ్యాంక్‌ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు 5 శాతం అంతకుమించి నిర్వహణా లాభాలు ఆర్జించిన బ్యాంకుల ఉద్యోగులు ఇన్సెంటివ్‌లు అందుకోనున్నారు. వేతనాల పెంపుపై యూనియన్లతో చర్చలు జరపాలని ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులతో కలిపి మొత్తం 37 బ్యాంకులు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను కోరిన సంగతి తెలిసిందే.

బ్యాంకు యూనియన్లు పలు మార్లు సమ్మెకు దిగాయి. స్ట్రైక్ చేశాయి. సుమారు 35 సార్లు చర్చలు జరిగాయి. చివరకు ఈ చర్చలు కొలిక్కివచ్చాయి. ఈ చర్చల్లో 15 శాతం వేతనాల పెంపుపై ఒప్పందం కుదిరింది. బ్యాంకు యూనియన్లు, ఐబీఏ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *