Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

పదోతరగతి పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు.. అక్కడ పరీక్షలు వాయిదా!

తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలను వాయిదావేయాలని ఆదేశించింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని.. అందులో పాసైన వారిని కూడా రెగ్యులర్‌గా పాసైనట్లు గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో గత కొంతకాలంగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పదోతరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ.. బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం (జూన్ 6) ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ సందర్భంగా తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనుంది.

వాదనలు ఇలా…
రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. పంజాబ్‌ తరహాలో ఇక్కడ కూడా పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాక ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

దానికి సమాధానంగా రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని.. ప్రశ్నపత్రాన్ని మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బందవుతుందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా లేక సాంకేతిక అంశాలు ముఖ్యమా అని హైకోర్టు ప్రశ్నించగా.. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని అడ్వకేట్ జనరల్ విన్నవించారు. విచారణ పూర్తయిన తర్వాత పదోతరగతి పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో వాయిదా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని సూచించింది. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే గుర్తించాలని ఆదేశించిన కోర్టు.. జీహెచ్‌ఎమ్‌సీ మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పదోతరగతి పరీక్షలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *